కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం హఠాత్తుగా మారబోతోందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు ఇంటి బయట అవసరం లేకుండా తిరగకూడదని సూచించారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడతాయని, పిడుగులు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. చెట్ల కింద, ఖాళీ ప్రదేశాల్లో నిలబడకూడదని, ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


