కాకతీయ, తెలంగాణ బ్యూరో: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ లొట్టే (Lotte) గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఉన్నతాధికారులు, ఎం.టీ.కృష్ణ బాబు, ఇండియన్ ఎంబసీ ప్రతినిధులు, ఈడీబీ అధికారులు కూడా పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఫుడ్, రిటైల్, కెమికల్స్, అతిథ్య రంగాల్లో విస్తృత పెట్టుబడులు పెట్టిన లొట్టే గ్రూప్‌ను ఏపీలోనూ వ్యూహాత్మక పెట్టుబడులకు ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను లొట్టే ప్రతినిధులకు మంత్రులు వివరించారు.
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు లొట్టే గ్రూప్ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సదస్సు ద్వారా ఏపీలోని అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి దిశగా తొలి అడుగులు వేస్తోందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యూహాత్మక పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రులు లొట్టే గ్రూప్ ప్రతినిధులకు వివరించారు. ఈ భేటీ ద్వారా ఏపీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులకు తలుపులు తెరిచే ప్రయత్నం స్పష్టమవుతోంది.


