రేవంత్ బెస్ట్ యాక్టర్
ఆయనకు భాస్కర అవార్డు ఇవ్వాలి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌వన్నీ నాటకాలే
బీసీ బిల్లుపై అసెంబ్లీలో చర్చెందుకు పెట్టలేదు?
కుల గణన రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే పార్టీ తరుపున సీట్లు కేటాయిస్తాం
పదవులు ముఖ్యం కాదు.. ప్రజల్లో ఉండండి లీడరవుతారు
మీడియాతో చీట్‌చాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు
కాకతీయ, హైదరాబాద్( జూలై 25 ) : సీఎం రేవంత్ రెడ్డి మంచి యాక్టరని ఆయనకు అత్తారింటికి దారేది సినిమాలో ఉన్న భాస్కర అవార్డు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ఎద్దేవా చేసారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ నాటకాలకు తెరలేపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని బీజేపీ అడ్డుకుంటున్నట్లుగా ప్రజల్లో దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. ఈవిషయంలో సీఎం రేవంత్ రెడ్డికి అత్తారింటికి దారేది సినిమాలో భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందేనంటూ వ్యంగ్యంగా చెప్పారు. బీసీలకు నిజంగా రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశమే ఉంటే.. బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ప్రత్యేక సమావేశం ఎందుకు పెట్టలేదు? బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్సు తేవాల్సిన అవసరం ఏముంది? సమగ్ర కుల గణన చేసినట్లుగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్టును ఎందుకు అసెంబీల్లో పెట్టడం లేదు.? మిగతా కులాల లెక్క ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ కాకి లెక్కలు మానుకోవాలని, కాకమ్మ కథలు చెప్పడం ఆపాలని అన్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరుపున 42శాతం టికెట్లను కేటాయింపు చేస్తామని వెల్లడించారు.
వెనకబడిన వర్గాలను ఎద్దేవా చేసిన సీఎం
మోదీని కన్వర్షన్ బీసీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనకబడిన కులాలను అవమానించేవిధంగా ఉన్నాయని రాంచందర్‌రావు అన్నారు. మోదీ కులాన్ని బీసీలో కలిపాకే ఆయన సీఎం అయ్యారని గుర్తు చేశారు. మోదీ కులం గురించి మాట్లాడే ముందు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ తాత ఒక పర్షియన్.. రాహుల్ బ్రాహ్మిణ్ అని చెప్పుకోవడం ఏంటని అన్నారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణ వర్గం ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. ఫొన్ ట్యాపింగ్ కేసు విషయంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాటకాలాడుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాంచి కెమిస్ట్రీ ఉందన్నారు. ఆ రెండు పార్టీల మధ్య కెమికల్ బంధం రోజురోజుకు పెరుగుతోందన్నారు. ప్రజల ముందు షాడో బాక్సింగ్ ఫైట్ చేస్తున్నాయని అన్నారు.
బీజేపీకి మీడియాలో స్పేస్ దొరకకుండా చేయడమే ఆ రెండు పార్టీల లక్ష్యమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో అధికారులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు, ఒక్క లీడర్ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు.? ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చారో ఎందుకు వెల్లడించడంలేదు. రేవంత్ తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటంటూ ప్రశ్నలు సంధించారు.
పోస్టుల కోసం నావద్దకు రావొద్దు..!
పార్టీ పోస్టుల కొరకు నా దగ్గరికి రావద్దంటూ పార్టీ శ్రేణులకు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ప్రజల వద్దకు వెళ్ళండి సమస్యలపై పోరాటం చేయండి అప్పుడే లీడర్ అవుతారు తప్ప పోస్ట్ వచ్చిన వారంతా లీడర్లు కాలేరని, ఐదేళ్లుగా నాకు ఏ పోస్ట్ లేదని నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తేవడమే లక్ష్యమంటూ స్పష్టం చేశారు. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తాను ఆ నెక్స్ట్ ఖమ్మం జిల్లా పర్యటన ఉంటుంది.


