నేటి నుంచి ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ
మొదటి రోజు ప్రకాశ్‌గౌడ్,మహిపాల్‌రెడ్డి,కృష్ణమోహన్‌రెడ్డి,యాదయ్యలకు పిలుపు
వాదనలు వినిపించేందుకు లాయర్లకు అనుమతి
ఈనెల 30లోపు వివరణ ఇచ్చేందుకు కడియం, దానంలకు గడువు
వారిద్దరూ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాకే మొగ్గు..?
గతంలో పార్టీ ప్రచారంలో పాల్గొనడంతో ఇరకాటంలో పడిన నేతలు
విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు..!
అనుమతి లేనిదే ఎంట్రీ ఉండదని కార్యాలయ అధికారుల ప్రకటన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి.. ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ సోమవారం విచారించనున్నారు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉండటంతో దానికి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు, పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో విచారణ చేపట్టేందుకు స్పీకర్ కార్యాలయం సిద్ధమైంది. నోటీసులు అందుకున్న 8 మంది ఎమ్మెల్యేల్లో సోమవారం నలుగురిని స్పీకర్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సమాచారం ఇచ్చింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 3గంటల్లోపు నలుగురు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్యలను స్పీకర్ వరుసగా విచారించనున్నారు. స్పీకర్/చైర్మన్ ఆధ్వర్యంలో 10 షెడ్యూల్ ప్రకారం విచారణ జరపనున్నారు.
అక్టోబర్5లోగా మొత్తం ప్రక్రియ పూర్తి..!!
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణను అక్టోబర్ 5వ తేదీలోగా ముగించాలని స్పీకర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ అక్టోబర్ 6 నుంచి 23 వరకు కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు కోసం బార్బడోస్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనకు ముందే ఈ విచారణ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విచారణలో భాగంగా వాదనలు వినిపించేందుకు ఆయా ఎమ్మెల్యేలు న్యాయవాదులను నియమించుకోవాలని స్పీకర్ కార్యాలయం ఇరుపక్షాలకు ఇటీవల మెమో జారీ చేసింది. దీనికి స్పందనగా, తమ తరపున న్యాయవాదిని నియమించుకున్నట్లు బీఆర్ఎస్ శాసనసభాపక్షం ప్రతినిధి స్పీకర్ కార్యాలయానికి లేఖ రాశారు. సోమవారం జరగబోయే విచారణకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. రోజుకు నలుగురు ఎమ్మెల్యేల చొప్పున రెండురోజుల్లో మొత్తం 8 మంది విచారణను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
కడియం, దానం రాజీనామాకే సిద్ధం..?!
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపు నోటీసులు ఇవ్వగా.. ఇందులో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది తమ వివరణలను అందజేశారు. ఇరుపక్షాల వివరణలు, అభ్యంతరాలు న్యాయసమీక్షకు అనుగుణంగా స్పీకర్ కార్యాలయానికి చేరడంతో విచారణకు శాసనసభాపతి కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈనెల 29 నుంచే స్పీకర్ సమక్షంలో విచారణ ప్రారంభించనున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో తొలివిడత.. తిరిగి వచ్చే 3, 4, 5 తేదీల్లో మలిదశ విచారణ చేపట్టనున్నారు. కాగా కడియం మాత్రం ఈ నెల 30లోపు వివరణ ఇస్తానని చెప్పినట్టు సమాచారం. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేశారు. అలాగే కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య తరుపున కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేశారు. దీంతో వారిద్దరూ స్పీకర్‌కు వివరణ ఇవ్వలేదు. అయితే వారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు..!
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ సోమవారం నుంచి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఈమేరకు బులెటిన్ విడుదల చేశారు. అనుమతి లేనిదే అసెంబ్లీలోకి నో ఎంట్రీ.. విజిటర్లు, మీడియాతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులకు నో ఎంట్రీ.. ముందస్తు అనుమతి ఉంటేనే అసెంబ్లీ బిల్డింగ్ లోకి ఎంట్రీ ఉంటుందని బులెటెన్‌లో పేర్కొనడం గమనార్హం. మీడియా పాయింట్ వద్ద సోమవారం నుంచి 6వ తేదీ వరకు ఎవరూ మాట్లాడొద్దని ఆంక్షలు విధించారు.


