కాకతీయ, రాయపర్తి /తొర్రూరు : సద్దుల బతుకమ్మ, దసరా పర్వదినం సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువులో జరగనున్న సద్దుల బతుకమ్మ సంబరాల ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని, మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ వేడుకలు ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, లైటింగ్, తాగునీరు, పార్కింగ్, వేదిక ఏర్పాటు, శానిటేషన్ వంటి అంశాలను వారు ప్రత్యేకంగా పరిశీలించారు.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్టోబర్ 2న పట్టణంలోని యతి రాజారావు పార్కులో నిర్వహించబోయే రావణ దహన కార్యక్రమం స్థలాన్ని కూడా పరిశీలించారు. రావణ దహన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని సూచించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసు విభాగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
కార్యక్ర మంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంగలపెళ్ళి రాం చంద్రయ్య,కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంటు సోమ రాజశేఖర్, నాయకులు గుండాల నర్సయ్య, బాపురెడ్డి, రాజేష్ నాయక్, ధరావత్ సోమన్న, వెంకట్ రెడ్డి, తునం శ్రవణ్, మహేష్, ప్రసాద్ రెడ్డి, విజయ్ పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


