కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని దుండగులు బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ముమ్మరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఇటీవల కాలంలో ఇలాంటి బెదిరింపులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులు, ఢిల్లీలోని పాఠశాలలు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్, ఫోన్ కాల్స్‌తో టార్గెట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే అలర్ట్‌లోకి వెళ్లింది. ఈమెయిల్స్ వెనుక అసలు ఎవరు ఉన్నారు, ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారన్న దానిపై విచారణ జరుగుతోంది.
వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్ల వంటి రద్దీ ప్రదేశాల్లో మరింత పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచిస్తున్నారు.


