కాకతీయ ఖమ్మం ప్రతినిధి: వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నేతృత్వంలో శనివారం దహనం చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన, సీజ్ చేసిన 200 కిలోల ఎండు గంజాయిని అడిషనల్ డీసీపీ ప్రసాదరావు పర్యవేక్షణలో తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గోపాల్‌పేట గ్రామంలో ఉన్న ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో నిర్వీర్యం చేశారు.
ఖమ్మం వన్ టౌన్, ఖమ్మం టూ టౌన్, ఖమ్మం త్రీ టౌన్, ఖమ్మం రూరల్, కూసుమంచి, వి.యం.బంజారా, కారేపల్లి, పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 18 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ డిసీపీ తెలిపారు. జిల్లా పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయి సరకును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్వీర్యం చేశామన్నారు. కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, సిసిఆర్బీ సీఐ స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.


