బీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర
బీఆర్ఎస్, బీజేపీలది ద్వంద నీతి
ఢిల్లీ తెలంగాణ భవన్‌లో మంత్రి కొండా సురేఖ
కాకతీయ, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మోసం చేస్తే తాము ఊరుకునేది లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఒక బీసీ మంత్రిగా… బీసీ బిడ్డగా… ఈ విషయంలో కపట వైఖరిని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అవలంభిస్తే తాము ప్రజల్లో ఎండగడతామని మంత్రి సురేఖ హెచ్చరించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్‌లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లును తాము అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపిస్తే బీజేపీ దాన్ని ఆపిందన్నారు. ఇది సహేతుకం కాదన్నారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉందని చెప్పారు. అయితే, దాన్ని ఒప్పుకుంటారా? లేదో రాష్ట్ర ప్రజలకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని సురేఖ డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేసే కార్యక్రమాలు చేయోద్దని బీజేపీని ఉద్దేశించి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతవర్గానికి చెందిన నాయకుడైనా ఆయా వర్గాలను ఒప్పించి బీసీ హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఈ దేశంలో దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని కూడా తాము ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నది కూడా మేమే అన్నారు. సమాజంలో వెనకబడిన వర్గాలు, నిమ్నవర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. నిన్నఢిల్లీకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, బీసీ మంత్రులతో పాటు నిపుణుల కమిటీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలతో భేటీ జరిగిందని గుర్తు చేశారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్టు వివరించారు. బీఆర్ఎస్ బీసీ కులగణనలో అసలే పాల్గొనలేదని, వారికి బీసీలపై ప్రేమ ఉండే అవకాశం లేదని మంత్రి విమర్శించారు. ఇప్పటికైనా బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్ ద్వంద వైఖరి వీడాలన్నారు.