కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇప్పటికే వివిధ విభాగాలతో సమీక్షలు జరిపి, ఓటర్ల సౌకర్యం, భద్రత, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికలను మూడుదశల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వం ఈనెల 30వ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. రిజర్వేషన్ల నివేదికలు అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అయితే కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను కూడా ఎన్నికల సంఘం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన విభాగాలైన ఎక్సైజ్, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల నుంచి నివేదికలను ఇప్పటికే పొందింది. మద్యం నియంత్రణ, శాంతి భద్రత, లాజిస్టిక్స్ వంటి అంశాల్లో ఈ శాఖలు తమ ప్రణాళికలను సమర్పించాయి. మొదటగా ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ విడుదల తర్వాత ఓటర్ల జాబితాలు, పోలింగ్ సెంటర్ల ఏర్పాట్లు, సిబ్బంది కేటాయింపుపై పనులు వేగం కానున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజే అవకాశముంది.


