కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎంజీబీఎస్ వద్ద మూసీ ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రి 8 నుంచి ఎంజీబీఎస్ లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ బస్టాండ్ కు వచ్చే రెండు వంతెనల పై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో ఎంజీబీఎస్ ను తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు చాదర్ ఘాట్ దగ్గర చిన్న వంతెనపై వరద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఆ వంతెనను కూడా మూసివేయడంతో పెద్ద వంతెనపైనే రాకపోకలు సాగుతున్నాయి. దీంతో చాదర్ ఘాట్ పరిసరప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
చాదర్ ఘాట్ మూసానగర్ లోని రసూల్ పుర బస్తీలో మలక్ పేట్ ఎమ్మెల్యే హైమద్ బలాల పర్యటించారు. అక్కడున్న పరిస్థితిని సమీక్షించారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు డీఆర్ఎఫ్ బ్రుందాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ముసారాంబాగ్ వద్ద మూసీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో అంబర్ పేట్ నుంచి దిల్ షుక్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిని మూసివేశారు. మూసారాంబాగ్ పాత వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. నిర్మాణంలో ఉన్న వంతెనను కూడా తాకుతూ వరద నీరు వెళ్తోంది. దీంతో వరద నీటిలో కొత్త వంతెన నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది.


