కాకతీయ, గీసుకొండ: రాబోయే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను ప్రతి అధికారి ముందస్తు ప్రణాళికలతో పనిచేసి విజయవంతం చేయాలని ఎంపీడీఓ వి.కృష్ణవేణి సూచించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రిసైడింగ్ అధికారుల శిక్షణా తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ట్రైనింగ్ అబ్జర్వర్ కె.వేదవతి, ఎంపీడీఓ వి. కృష్ణవేణి మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగాలి అని పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావాలని, అభ్యర్థులు సమర్పించే ప్రతి నామినేషన్‌ను సక్రమంగా పరిశీలించి ఆమోదించినవి, తిరస్కరించినవి, తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా ప్రకటించాలని సూచించారు.
ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కచ్చితమైన సమయ పాలనతో పాటు ముందస్తు ప్రణాళికలు అవసరమని అధికారులు తెలిపారు. మాస్టర్ ట్రైనర్లు సురేష్ బాబు, రాం గోపాల్ రెడ్డి ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కమలాకర్, సీనియర్ అసిస్టెంట్ షాజహాన్, పిఓలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


