బీసీ రిజర్వేషన్లపై జీవో..
నేడోరేపో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు
42 శాతం ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు
రాజ్యాధికార దిశగా బడుగులకు ఉన్నత పదవులు
చాకలి ఐలమ్మ పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం
బీసీ సంక్షేమశాఖ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్
రవీంద్రభారతిలో ఐలమ్మ జయంతి వేడుకలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్లపై నేడో, రేపో జీవో వస్తుందని, 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ సంక్షేమశాఖ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ కుల సర్వే దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని, ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా న్యాయపరంగా, చట్టపరంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దళితులకు, గిరిజనులకు రాజ్యాంగపరంగా ఎంత రిజర్వేషన్లు ఉంటే అంత ఇస్తూ .. బీసీలకు 42 శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది.. కాపాడుకునే బాధ్యత మీదన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగితే రాజ్యాధికార దిశగా ఉన్నత పదవులు దక్కుతాయన్నారు. రవీంద్రభారతిలో వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఇనుగుర్తి మధు రాసి పాడిన పాటను & రజకుల ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
ధీర వనిత ఐలమ్మ..
భూమి కోసం, భుక్తి కోసం నిరంకుశ పాలనపై పోరాడిన ధీర వనిత ఐలమ్మ అన్నారు. సామాజిక న్యాయం కోసం, మహిళలకు గౌరవం భంగం కలిగితే తిరుగుబాటు చేశారన్నారు. 130 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం తరుపున ఆమె జయంతిని జరుపుకుంటున్నాం అంటే ఆమె ఎంతో గొప్ప పోరాట యోధురాలు అన్నారు. కుల వృత్తులు నాముషి కాదు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తులు మారాలని, అప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం అన్నారు. రజకుల సమస్యలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామని, 119 నియోజకవర్గాల్లో ఎలక్ట్రిక్ డ్రైకింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికల రూపొందించామన్నారు. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పై అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా జరగాలని ఆదేశాలు ఇచ్చాం.. అధికారులు అడ్డంకులు సృష్టిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించామన్నారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్,ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీసీ జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ కమీషనర్ బాల మాయాదేవి ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.


