సెప్టెంబర్‌లో మెరుగైన యూరియా సరఫరా
రాష్ట్రానికి ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 7.88 లక్షల మెట్రిక్ టన్నులు..
ఒక్క ఈ నెలలోనే 1.84 లక్షల మెట్రిక్ టన్నులు,,
రబీ సీజన్ కోసం ముందస్తుగానే సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరాం..
మొదటి మూడు నెలలు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున అందించాలి
రైతులను ఆదుకునేందుకు కేంద్రంపై ప్రభుత్వం ఒత్తిడి
వ్యవసాయశాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సెప్టెంబర్ నెలలో రాష్ట్రానికి యూరియా సరఫరా గత నెలల కంటే మెరుగ్గా రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి మొత్తం 7.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందగా, వీటిలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే 1.84 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా కావడం శుభ పరిణామమని తెలిపారు. గత నెలలో ప్రతి సారి కేటాయించిన యూరియా కంటే తక్కువగా సరఫరా అవడం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పదే పదే కేంద్రాన్ని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడంతో ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా జరిగిందని అన్నారు.
దిగుమతులపై ప్రతికూల ప్రభావం
ఏప్రిల్ నెలలో 1.71 లక్షల మెట్రిక్ టన్నులకు 1.21, మే నెలలో 1.61 లక్షల మెట్రిక్ టన్నులకు 0.88, జూన్ నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నులకు 0.98, జులై నెలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నులకు 1.43, అగస్టు నెలలో 1.70 లక్షల మెట్రిక్ టన్నులకు 1.55 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయిన విషయాన్ని గుర్తుచేశారు. దిగుమతి టెండర్లలో ఆలస్యం, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడటం, దాని వల్ల కేంద్రం కూడా రాష్ట్రాలకు సరిపడా యూరియాను అందించలేకపోవడం రైతులను ఇబ్బందులకు గురి చేసిందని వివరించారు.
కేంద్రంపై ప్రభుత్వం ఒత్తిడి
ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనుకాడకుండా రైతుల అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర మంత్రులను కలవడం, తానే కేంద్రంతో భేటీలు జరపడం, మా ఎంపీలు పార్లమెంట్ అవరణలో నిరసనలు వ్యక్తం చేసి వినతిపత్రాలు సమర్పించడం, అధికారులు కేంద్ర ఎరువుల శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపడం వలన కేంద్రం చివరకు సానుకూలంగా స్పందించి ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా చేసిందని మంత్రి తెలిపారు.
అదనంగా దిగుమతి..
ఆగస్టులోనే సెప్టెంబర్ కేటాయింపుతోపాటు అప్పటి వరకు ఏర్పడిన లోటును కూడా భర్తీ చేసేలా యూరియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, దానికి అనుగుణంగానే సెప్టెంబర్ మాసంలో కేటాయించిన 1.60 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా 25వ తేదీ వరకు 1.84 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి అందాయని చెప్పారు. ఇదే రైతులకు ఊరట కలిగించే అంశమని అన్నారు. ఇప్పటికే అందిన యూరియాతో పాటు నేడు, రేపు వరుసగా పలు కంపెనీల నుండి మరో 9864 మెట్రిక్ టన్నులు, 9674 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. ఈ యూరియా రైల్వే రేక్ పాయింట్లయిన వరంగల్, మంచిర్యాల, గద్వాల, కరీంనగర్, పందిళ్లపల్లి, జడ్చర్ల, తిమ్మాపూర్ ప్రాంతాలకు చేరుకుంటుందని, అక్కడి నుండి జిల్లాలకు సరఫరా అవుతుందని వివరించారు. అంతేకాక మరికొన్ని ఇతర కంపెనీల నుండి మరో 34,700 మెట్రిక్ టన్నుల యూరియా రేక్ ప్లాన్ ఉందని, ఇది ఈ నెలాఖరు వరకు రాష్ట్రానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.
ముందుచూపుతో పంపిణీ…
గత ఖరీఫ్ సీజన్‌లో ఇదే సమయానికి 9.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరగడాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ఇప్పటి వరకు జిల్లాలకు 9.50 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేశామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో జులై నెలలోనే గత ఏడాది కంటే 1 లక్ష మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా అమ్ముడవ్వడం రైతుల అవసరాలు ఎక్కువయ్యాయని, అయితే అప్పట్లో కేంద్రం నుండి సరఫరా తక్కువ రావడం వలన రైతులు కొంత ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. అయినప్పటికీ జిల్లాలకు గత ఏడాది ఇదే సమయానికి కంటే ఎక్కువ యూరియాను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయగలిగిందని చెప్పారు.
ప్రతి నెలకు 2 లక్షలకు తగ్గకుండా ..
రానున్న రబీ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ప్రతి నెలకు 2 లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు. రబీ సీజన్ కు వాస్తవ ప్రణాళిక 10.40 లక్షల మెట్రిక్ టన్నులు అని, ఖరీఫ్ లో జరిగినట్టుగా రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలంటే రబీ సీజన్ మొదటి 3 నెలలలో 6 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా యూరియాను సరఫరా చేయాలని మంత్రి కోరారు.
రైతులకు ఇబ్బంది కలిగించం..
రైతుల అవసరాల దృష్ట్యా యూరియా సరఫరా విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిరంతరం ఒత్తిడి చేయడం, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించడం కొనసాగిస్తుందని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన హామీ ఇచ్చారు.


