- హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, కరీంనగర్ : పట్టణాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ పట్టణానికి రూ.15 కోట్లు, జమ్మికుంట పట్టణానికి రూ.15 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.10 కోట్లు, హుజురాబాద్ మున్సిపాలిటీకి మరో కోటి 8 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అదనంగా హుజురాబాద్‌కు ఐటీఐ (ఏటీసీ) కాలేజీని కూడా ప్రభుత్వం ఆమోదించినట్లు చెప్పారు.
ఈ మేరకు ప్రణవ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే సుమారు రూ.40 కోట్ల నిధులు వచ్చాయని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో బోగస్ ప్రచారాలు చేస్తూ అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పటికీ కౌశిక్ రెడ్డి హుజురాబాద్ అభివృద్ధికి రూపాయి నిధులు కూడా లేలేదని, చిత్తశుద్ధి ఉంటే తాను ఏం సాధించాడో చెప్పాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. వీణవంక–నరసింగాపూర్ రహదారిని కూడా పూర్తి చేయలేని కౌశిక్ రెడ్డి 30 కోట్ల నిధులు తెచ్చానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్‌కు మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని ప్రణవ్ హామీ ఇచ్చారు.


