కాకతీయ, వరంగల్ బ్యూరో: భద్రకాళి అమ్మవారి ఆలయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలోకి అకస్మాత్తుగా నాగుపాము రావడంతో అక్కడి భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం ప్రకారం, మొదట భద్రకాళి గుడిలో కనిపించిన నాగుపాము, ఆపై గణపతి ఆలయం వైపు వెళ్లింది.
నాగుపామును గమనించిన ఒక భక్తుడు వెంటనే భద్రకాళి ఆలయ సిబ్బందికి సమాచారం అందించాడు. ఆ సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ఆలయంలో ఉన్న భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఆలయ సిబ్బందిలోని నాగరాజు చాకచక్యంగా పామును పట్టుకున్నారు.
కొంతసేపు భయాందోళనలో ఉన్న భక్తులు, నాగుపామును సురక్షితంగా పట్టుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ప్రమాదం తప్పిందని, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన కారణంగా ఆలయ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, సిబ్బంది సమయానికి స్పందించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.


