కాకతీయ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాని..ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్ తోపాటు పలువురు నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్ లో ప్రతి అంశం పార్టీవైపే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని కేసీఆర్ అన్నారు. క్షేత్రస్థాయిలో కిందిస్థాయి కార్యకర్తలను అప్రమత్తం చేసి ఓటర్లలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.


