కాకతీయ, సినిమా డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతకాలం ఎదురుచూసిన ‘ఓజీ’ సినిమా గురువారం థియేటర్లలో విడుదలై భారీ సంచలన విజయం సాధించింది. ప్రీమియర్ షోల నుంచే సినిమాపై పాజిటివ్ టాక్ రావడం, ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయడం గమనార్హం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని పవర్‌ఫుల్, స్టైలిష్ లుక్‌లో చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఈ విజయం డైరెక్టర్ సుజీత్‌కు కూడా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చింది.
సుజీత్ 1990 అక్టోబర్ 26న అనంతపురంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఆయన ఎల్.వి. ప్రసాద్ ఫిలిం & టీవీ అకాడమీలో చదివారు. షార్ట్ ఫిల్మ్స్ తీయాలని ఉన్నా, కెమెరా కొనడానికి డబ్బులు లేవు. ఈ సమయంలో సుజీత్ తల్లి తన బంగారం తాకట్టు పెట్టి 44,000 రూపాయలు ఇచ్చి కెమెరా కొన్నారట. ఈ కెమెరా సుజీత్ జీవితాన్ని మార్చిన కీలక సాధనం అయ్యింది. సుజీత్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్‌లో మంచి ఫీడ్‌బ్యాక్ పొందాయి. ఆ ఫిల్మ్స్‌ను పూరి జగన్నాథ్‌కు చూపించగా, పూరి ఆయనను అసిస్టెంట్‌గా కాకుండా, స్వతహాగా సినిమా తీయమని ప్రోత్సహించారు.
తరువాత యువి క్రియేషన్స్ కొత్త టాలెంట్ కోసం చూస్తుండగా, సుజీత్ వారికి “రన్ రాజా రన్” కథ చెప్పాడు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో ప్రభాస్ కూడా సుజీత్ ప్రతిభను గుర్తించాడు. ‘బాహుబలి 2’ షూటింగ్ సమయంలో సుజీత్ చెప్పిన సాహో కథ ప్రభాస్‌కి ఆకట్టుకుంది. ఈ విధంగా రెండో సినిమాతోనే సుజీత్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దక్కించుకున్నారు.
తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ సినిమాను తెరకెక్కించడానికి అవకాశం దక్కింది. అన్ని అంచనాలను మించి, సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫ్యాన్స్ ఈ సినిమాను మాస్ ఫీస్ట్‌గా ఆనందించగా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. డైరెక్టర్ సుజీత్, ప్రవల్లిక రెడ్డి వివాహం కూడా సినిమా విజయంతో సోషల్ మీడియాలో హైలైట్ అయింది. ఈ స్థాయి విజయంతో సుజీత్ సినిమా వర్గాల్లో మరింత గౌరవం పొందాడు.


