ఆసరా కోసం వేదన – లైన్లలో విలవిలాడుతున్న వృద్ధులు
కాకతీయ, నర్మేట్ట:
జనగామ జిల్లా నర్మెట్ట గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వృద్ధులు, వికలాంగులు తమ పింఛన్ల కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిలబడ్డారు. అధికారులు ఐరిస్ పద్ధతిలోనే పంపిణీ చేయడంతో ఉదయం నుంచి గంటల తరబడి లైన్లో నిలబడి వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
80 ఏళ్ల పైబడిన పెద్దవాళ్లు వర్షంలో తడుస్తూ, నేలపై కూర్చొని లేదా కష్టపడి నిలబడుతూ తమ వంతు కోసం వేచి ఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. చాలామంది ఆరోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులు లైన్‌లో నిలబడలేక కూలిపోవడం వంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
వృద్ధుల కష్టాలు గమనించిన గ్రామస్తులు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులు ఇలా అవస్థలు పడకుండా పింఛన్లు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని లేదా వారి ఇళ్లకే వెళ్లి అందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.ఒక పింఛన్ కోసం ఈ వయసులో గంటల తరబడి లైన్‌లో నిలబడలేం… మాకు ఇంటివద్దకే ఇచ్చేలా చూడాలి” అని ఒక వృద్ధుడు వేదన వ్యక్తం చేశారు.ఆసరా పేరుతో వృద్ధులకు ఇచ్చే సహాయం వాస్తవానికి వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుందని పింఛన్ దారులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, సరైన సదుపాయాల లేమి వృద్ధుల జీవితాలను మరింత కష్టాల్లోకి నెడుతోందని వారు చెబుతున్నారు.
క్యూ లైన్ లో నిలబడి క్రిందపడిన వృద్ధుడు మల్లయ్య
నా పేరు ప్రజ్ఞాపురం మల్లయ్య, నా వయసు 80 సంవత్సరాలు, నేను ఆసరా పెన్షన్ కోసం లైన్‌లో నిలబడితే నెట్టివేయడంతో కింద పడి తుంటికి గాయాలయ్యాయి. ఈ వయసులో లైన్లో నిలబడలేకపోతున్నాము. అధికారులు 70 ఏళ్లు నిండిన నాలాంటి వారికి ఇంటివద్దకే ఆసరా పెన్షన్లు ఇవ్వాలని వేడుకుంటున్నాను.


