సర్కారాఫీసుల్లో సద్దుల బతుకమ్మ సందడి
కాకతీయ, బయ్యారం : తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం దసరా ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవోసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా రెవెన్యూ, పంచాయతీ రాజ్ యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా సిబ్బంది వారు రూపొందించిన బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆట, పాటలతో సందడి చేశారు. అనంతరం మహిళలతో కలిసి ఇంచార్జ్ ఎంపిడిఓ దైవదినం, తహసీల్దార్ నాగరాజు బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బతుకమ్మ ప్రాముఖ్యతను వివరించారు. పూలనే పూజించి దేవతలుగా కొలుస్తున్న ఏకైక గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. మన పండుగ, మన సంస్కృతి ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే ఏకైక పండుగ బతుకమ్మ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.


