కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 23న డ్రా (లక్కీ డిప్) పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపులు జరగనున్నాయి. కొత్తగా కేటాయించే షాపుల లైసెన్స్ కాలపరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. టెండర్ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం రూ. 3 లక్షలుగా నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. ఆ గడువు పూర్తయ్యే సరికి కొత్త లైసెన్సులు అమల్లోకి రానున్నాయి.
ఎక్సైజ్ చట్టం ప్రకారం, గతంలో 1968 ఎక్సైజ్ యాక్ట్ కింద శిక్షలు ఎదుర్కొన్న వారు లేదా నిబంధనలు ఉల్లంఘించిన వారు కొత్త దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే అర్హత ఉండదని స్పష్టంచేశారు. అలాగే టెండర్ దరఖాస్తులు సమర్పించే వారు పూర్తి వివరాలతోపాటు అవసరమైన డాక్యుమెంట్లు జతచేయాలని సూచించారు.
ఇక, రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు ఎక్కడెక్కడ అనుమతించాలన్న దానిపై ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రాథమిక అంచనాలు పూర్తి చేసింది. జనాభా సాంద్రత, రోడ్డు కనెక్టివిటీ, మునిసిపల్ పరిమితులు, గ్రామీణ ప్రాంత అవసరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దుకాణాల సంఖ్యను ఖరారు చేసినట్లు సమాచారం.

ఈసారి లైసెన్స్ గడువు కేవలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించడం విశేషం. గతంలో మాదిరిగానే డ్రా సిస్టమ్ ద్వారా పారదర్శకంగా కేటాయింపులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మద్యం దుకాణాల కేటాయింపుతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రతి కొత్త లైసెన్స్ ద్వారా లైసెన్స్ ఫీజు, టెండర్ ఫీజు రూపంలో ఎక్సైజ్ రెవెన్యూ గణనీయంగా పెరగనుంది. మరోవైపు, మద్యం దుకాణాల కేటాయింపులో ఎటువంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.


