కాకతీయ, వరంగల్: హన్మకొండ జిల్లాలో అవినీతి అధికారి బాగోతం బట్టబయలు అయ్యింది. జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో రూ. 18వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డాడు అసిస్టెంట్ ఇంజనీర్ రమేశ్. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. గురువారం హన్మకొండ విద్యాశాఖాధికారి ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఈ తనిఖీల్లో రూ. 18వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు అసిస్టెంట్ ఇంజనీర్ రమేశ్.
కొడకండ్లలో స్కూల్ బిల్డింగ్ మంజూరు కోసం రమేశ్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు బాధితులు. వారి ఫిర్యాదు మేరకు నేడు హన్మకొండ డీఈవో ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు అధికారులు. లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ ఇంజనీర్ రమేశ్ ను అధికారులు పట్టుకున్నారు.
రమేశ్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వాధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని లంచం ఇచ్చి అవినీతిని ప్రోత్సహించవద్దని అధికారులు కోరుతున్నారు.


