కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ వాయువ్య దిశలో గాలుల ప్రభావం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
నేడు (బుధవారం), రేపు (గురువారం) రాష్ట్రంలోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాల సూచన ఉంది.
రైతులు జాగ్రత్తగా వ్యవసాయ పనులు కొనసాగించాలని, తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ అంతరాయం, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల మేరకు, రాబోయే రెండు రోజులు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండి, అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించింది.


