మహాలక్ష్మి పథకం గ్రాండ్ సక్సెస్
200 కోట్ల మంది ఉచిత ప్రయాణం
6680 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న మహిళలు
హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా లోకం
కాకతీయ, యాదగిరిగుట్ట : మహాలక్ష్మి పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణం పథకం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు . దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ పథకం ఉత్సవాలు నిర్వహించుకుంటుంది. ఈ పథకం పట్ల మహిళా లోకం పూర్తి సంతృప్తిని హర్షాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ రోజు వరకు 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తద్వారా 6680 కోట్ల రూపాయల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారు.

ప్రస్తుతం ఏ బస్సులో చూసినా మహిళా ప్రయాణికులే అత్యధికంగా కనిపిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పథకం జనాకర్షక పధకంగా కనిపిస్తున్నప్పటికీ, మహిళా సాధికారతకు ఎంతగానో తోడ్పడుతోంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ పథకం ఆదర్శంగా మారుతుంది. కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ఎన్ని రోజులు మోస్తారు …ఏదో ఒక రోజు ఈ పథకానికి స్వస్తి పలుకుతారు…. అని విమర్శలు గుప్పించిన వారి నోళ్లకు తాళాలు పడ్డాయి. రోజురోజుకు ఇనుమడించిన ఉత్సాహంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ఈ పథకాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భేష్ అనిపించుకుంటుంది. మహిళా లోకం అభిమానాన్ని ఈ పథకం చూరగుంది. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట డిపో యాదాద్రి బస్ స్టేషన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు .ఏసిపి శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయగా ,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పావని, అలాగే జిల్లా పరిషత్ బాలికలు పాల్గొన్నారు .ప్రతిరోజు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలకు బహుమతులే కాకుండా శాలువాలతో సత్కరించారు .జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు ఏసిపి శ్రీనివాస్ నాయుడు తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సిహెచ్ మురళీకృష్ణ ,అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ ,గ్యారేజ్ ఇంచార్జ్ హనుమాన్ నాయక్, ముత్యాలు, మనోజ్ కుమార్ తో పాటు డిపో సిబ్బంది పాల్గొన్నారు.


