జీపీవోలు ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలి
క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలను అందించాలి
భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి
జీపీవోల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో కొత్తగా నియమితులైన గ్రామ పాలన అధికారులు (జీపీవోలు) గ్రామ స్థాయిలో పారదర్శక పాలనను అందించాలనే సంకల్పంతో ముందుకు సాగాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ వి.లచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని రెవెన్యూ గార్డెన్స్‌లో జరిగిన జీపీవో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. జీపీవోలు కేవలం ఉద్యోగులుగా కాకుండా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే సేవకులుగా ఉండాలని సూచించారు. భూ భారతి చట్టం అమలుతో గ్రామ రెవెన్యూ వ్యవస్థకు కొత్త ఊపిరి లభించిందని, జీపీవోలు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని, తమ సమస్యల పరిష్కారం బాధ్యత జేఏసీదేనని హామీ ఇచ్చారు. ఏ ఒక్కరు తప్పు చేసిన మొత్తం రెవెన్యూ వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. త్వరలోనే వేతనాలపై తీపి కబురు వస్తుందని, కారుణ్య నియామకాల విషయమై కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అనంతరం టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థను గతంలో దెబ్బతీసినవారే నేడు మళ్లీ మన మధ్య తిరుగుతున్నారని విమర్శించారు. జీపీవోలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, పౌరసేవలో నిబద్ధతతో ఉండాలని సూచించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర, జిల్లా రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు, రిటైర్డ్ అధికారులు, పెద్ద సంఖ్యలో జీపీవోలు పాల్గొన్నారు.


