కాకతీయ, బిజినెస్ డెస్క్: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం పేరు వింటేనే సామాన్యులు జంకుతున్నారు. తులం బంగారం కొనాలంటే లక్షా 50వేలు చేతులో పట్టుకోవాల్సిందే. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. 2,700 పెరిగి రూ. 1,18,900కి చేరింది. సోమవారం రూ. 2,200 పెరిగిన ధర రెండో రోజు మరింతగా ఎగబాకినట్లు పరిశీలకులు పేర్కొన్నారు. గడిచిన రెండు రోజుల్లోనే బంగారం ధర రూ. 5,000 పైగా పెరిగింది.
అలాగే, 99.5శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.2,650 చేరుకుని చారిత్రక గరిష్ఠ స్థాయి రూ. 1,18,300కి ఎగబాకింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా 99.9శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. 2,000 ఎగబాకి రూ. 1,19,000ను దాటింది.
కిలో వెండి ధర రూ. 3,220 పెరిగి ఆల్-టైం హై రూ. 1,39,600కు చేరింది. ఐటీ కంపెనీలు, డాలర్ బలహీనత, H1-B వీసా ఫీజు పెంపు వంటి కారణాల వల్ల మదుపరులు విలువైన లోహాల వైపు పెట్టుబడులను మళ్లించడం వెండి–బంగారం ధరలు పరుగెత్తించిందని HDFC వర్గాలు పేర్కొన్నారు.
మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, బంగారం ధరలు త్వరలో రూ. 2 లక్షలకు చేరవచ్చని చెబుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లో 50శాతం పెరిగిన ధరలు, వచ్చే ఐదు సంవత్సరాల్లో అదే వేగంతో రూ. 2 లక్షల పైకి ఎగబాకే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఈ ధరలను పెంచుతున్న ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.


