- అదనపు కలెక్టర్ డి.వేణు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : వానాకాలం 2025 సీజన్ లో ధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు వ్యవసాయ శాఖ పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు అంశంలో వ్యవసాయ శాఖ పోషించాల్సిన పాత్ర పై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం 2025 సీజన్ పంట కొనుగోలు సమయంలో సన్న రకం ధాన్యానికి కనీసం మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ప్రకటించిందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యతకు సంబంధించి ఏమైనా వివాదాలు తలెత్తితే వ్యవసాయ విస్తరణ అధికారులు పరిష్కరించాలన్నారు. అదే సమయంలో సన్న ధాన్యం నాణ్యత ను మండల వ్యవసాయ అధికారులు పరిష్కరించాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీని తగ్గించుటకు గాని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచనలు ఇస్తూ ఒకే సమయంలో కాకుండా దశల వారీగా వరి కోతలు చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ వరి కోతలు క్రమ పద్ధతిన జరిగేలా చూడాలని, కోతల సమయంలో హార్వెస్టర్లు 18 కంటే ఎక్కువ ఆర్.పి.ఎం నడిచేలా చూడాలని తద్వారా కోతల సమయంలోనే తాలూ, చెత్త వంటి పదార్థాలు ధాన్యం నుండి వేరు చేయవచ్చని తెలిపారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ విస్తరణ అధికారికి ట్యాగ్ చేయాలని తెలిపారు. కౌలు, పేద రైతులు, చిన్న కమతాలను సాగు చేస్తున్న రైతులు, ప్రభుత్వ, అటవీ భూములలో పంటలు పండించే చిన్న కారు రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వ లేరని, వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ అంశాన్ని పరిశీలించి తగు ధ్రువీకరణ పత్రంతో 50 క్వింటాళ్ల వరకు ధాన్యం కొనుగోలు చేపట్టవచ్చని తెలిపారు. 50 క్వింటాళ్ళకు మించినట్లయితే మండల వ్యవసాయ అధికారి ధృవీకరించాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు.


