- నిందితులను తక్షణం అరెస్టు చేయాలి
- విధులు బహిష్కరించిన వైద్యులు, హోరెత్తిన నిరసనలు
- ఉద్రిక్తంగా మారిన ఏరియా ఆస్పత్రి
- మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న డాక్టర్లు, డాక్టర్లతో చర్చిస్తున్న అదనపు కలెక్టర్
కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని మహబూబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రాత్రి నల్లెల్ల గ్రామానికి చెందిన పలువురు వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఆ సమయంలో వైద్యులు డ్యూటీలో లేరంటూ , సిబ్బందితో వాగ్వివాదం ముదిరి తోపులాట వరకు వెళ్లినట్లు సమాచారం.
ఈ సంఘటనపై వైద్యుల ఫిర్యాదుతో సోమవారం సంబంధిత అనుమానిత బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. కాగా, మంగళవారం వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడి చేయబోయిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వైద్యులు, స్టాఫ్ నర్స్ , మెడికల్ కాలేజీ సిబ్బంది నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో ఓపీ నిలిచిపోవడంతో అత్యవసర వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చిందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, డీఎస్పీ తిరుపతిరావు వైద్యులు, సిబ్బందితో చర్చలు జరిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నచ్చ చెప్పినప్పటికీ వారు చాలా సేపటి వరకూ ఆందోళన విరమించలేదు. నిరసనల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఎం జగదీష్, వైద్యులు ,సిబ్బంది తదితరులు ఉన్నారు.


