- మతోన్మాద రాజకీయాలను ఎండగట్టాలి: ఎస్ఎఫ్ఐ
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కరీంనగర్‌లోని ముకుందలాల్ మిశ్రా భవనంలో మంగళవారం రాష్ట్ర విద్యా-వైజ్ఞానిక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు శిక్షణ తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐదేనని, విద్యా రంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులలో మత, కుల వివక్షను చొప్పించే ప్రయత్నాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు.
అలాంటి మతోన్మాద రాజకీయాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ మాట్లాడుతూ ఈ ఏడాది ఐటీఐ ప్రవేశాలు నిలిపివేయడం, సంప్రదాయ ట్రేడ్లను విస్మరించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దాదాపు రూ.8700కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు, కళాశాలలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతుండటం ఆందోళన కలిగించే విషయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపెల్లి పూజ, సహాయ కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్, కిరణ్, ప్రశాంత్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.


