- మంగపేట మండలంలోని 23 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా పరిగణించొద్దు
- సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పిటిషన్‌పై విచారణ
- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం
- ఎన్నికలు, స్థానిక పరిపాలన, భూహక్కులకు నిలిచిపోయే అవకాశం!
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించరాదంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.
మంగపేటలోని 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబ్ గ్రామాలుగా పరిగణించవద్దంటూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) పిటిషన్ దాఖలు చేశారు. ఆ గ్రామాలను ట్రైబల్ గ్రామాలుగా గతంలో తెలంగాణ హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో పరమాత్మ, పూజారి సమ్మయ్యలు సవాల్ చేశారు. సీనియర్ అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 1950లో రాష్ట్రపతి ఇచ్చిన షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్‌లో మంగపేట మండలంలోని ఈ 23 గ్రామాలు లేవని కోర్టుకు తెలిపారు. నిజాం పాలనలో ఉన్న రికార్డులను ఆధారంగా చేసుకుని హైకోర్టు షెడ్యూల్డ్ ఏరియాగా పరిగణించాలని ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలయ్యింది.
తెలంగాణ హైకోర్టు గతంలో ఈ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో భాగంగా గుర్తించి, స్థానిక పాలనలో గిరిజన రిజర్వేషన్ అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు తుది విచారణ జరుగుతున్న సమయంలో ఎన్నికలు, స్థానిక పరిపాలన, భూహక్కులు వంటి అంశాలు ఈ మధ్యంతర ఉత్తర్వులతో తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది.


