కాకతీయ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో వరుస దొంగతనాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణ కాలనీ, నాగారం ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానిక నివాసి పవన్ శర్మ తన ఇంటికి తాళం వేసి పూజల కోసం వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టబడి ఉండటంతో అనుమానం కలిగింది. లోపలికి వెళ్లి చూసే సరికి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఇంటి బీరువా ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు 30 తులాల బంగారు నగలు అపహరించినట్టు పవన్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆధారాల కోసం క్లూస్ టీంను కూడా పిలిపించారు. తరువాత సిసిఎస్ ఎసిపి నాగేంద్ర చారి కూడా అక్కడికి వెళ్లి పరిస్థితులను గమనించారు. ప్రస్తుతం ఐదో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ చోరీతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది. ఎందుకంటే, గత ఐదు రోజుల క్రితం కూడా ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో మరో పెద్ద చోరీ జరిగింది. ఆ ఘటనలో దుండగులు కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, దాదాపు 10 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఆ కేసులో దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన ఫలితం కనిపించలేదని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. దీంతో వరుసగా భారీ దొంగతనాలు జరగడం పోలీసులకే పెద్ద సవాలుగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.


