కాకతీయ, ఖిలా వరంగల్: పర్యాటకంగా ఓరుగల్లు కు పెట్టింది పేరు, ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వరంగల్ నగరానికి వస్తుంటారు. ముఖ్యం గా కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోట లోని శిల్పారావం, కాకతీయ శిలాఖండాలు, కాకతీయ కళా తోరణలు, కాకతీయుల కాలం నాటి శిల్పకళ నైపుణ్యం ప్రపంచ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తూ అబ్బుర పరుస్తున్నాయి. నిత్యం దేశ నలుమూలల నుండి మరియు వివిధ దేశాల నుండి పర్యాటకులు ఖిలా వరంగల్ కోటకు వస్తుంటారు.
పర్యాటకంగా దేశ విదేశీయులను ఆకర్షిస్తున్న ఖిలా వరంగల్ కోటను మరింత అభివృద్ధి పరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో టూరిజం శాఖ కోట్ల వ్యయంతో ఖిలా వరంగల్ కోట శిల్పారామం లో ఇల్యూమినేషన్ లైట్స్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసింది. గతేడాది మార్చి 7న ఈ లైట్స్ అండ్ సౌండ్ షోను కేంద్ర, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, కొండా సురేఖ లు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ లైట్ షో తో ఓరుగల్లు కు మరింత ప్రఖ్యాతి చెందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు కానీ ప్రారంభించిన మూన్నాళ్లకే మూగబోయిన సౌండ్ సిస్టంతో లైట్ షో మూలన పడిపోయింది.
ఇది తెలియక ఓరుగల్లు పర్యటనకు వచ్చిన దేశ విదేశీ పర్యాటకులు సౌండ్ అండ్ లైట్ షో పనిచేయడం లేదని తెలుసుకొని నిరాశతో వెళ్లిపోతున్నారు. 20 సెప్టెంబర్ 2025 శనివారం రోజున 27 దేశాలకు చెందిన 30 మంది పర్యాటకులు ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. కానీ సౌండ్ అండ్ లైట్ షో చూడ కుండానే నిరాశ తో వెనుదిరిగారు.
తూతూ మంత్రంగా టూరిజం శాఖ
కాకతీయుల సామ్రాజ్య విశిష్టతలను సౌండ్ అండ్ లైట్ షో తో దేశ విదేశీయుల పర్యాటకులకు తెలియజేయడం కోసం కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన సౌండ్ అండ్ లైట్ షో టూరిజం శాఖ నిర్లక్ష్యం వలన మూడు నెలలకే మూతపడిపోయింది. మూతపడి నెలలు గడుస్తున్న ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు.
అసలు ఏం జరిగింది, కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్ షో ఎందుకు నిర్వహించ లేకపోతున్నారని కాకతీయ దినపత్రిక ప్రతినిధి టూరిజం శాఖ సౌండ్ అండ్ లైట్ షో ఏఈ ను ఫోన్లో సంప్రదించగా, లైట్ షో స్క్రీన్ పాడైపోయింది. నాలుగు నెలల క్రితమే సింగ్ షేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చాము. కానీ ఇప్ప్పటికి స్క్రీన్ అందించ లేకపోతున్నారు, ప్రైవేట్ కంపెనీతో మాట్లాడుతున్నాం, ఇంకో వారం రోజుల్లో సౌండ్ అండ్ లైట్ షో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
అసలు సింగ్ షేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది
కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన సౌండ్ అండ్ లైట్ షో లో పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు మిగతా పరికరాలు, బాగానే ఉన్నా, కేవలం ఒక స్క్రీన్ రిపేర్ కోసమే నెలకొంది జాప్యం చేస్తున్నారంటే ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మర్మం ఏమిటో అర్థం కావడం లేదని, నెలలు గడుస్తున్న ఆ కంపెనీ కోసమే అధికారులు ఎందుకు ఎదురు చూస్తున్నారు అని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టూరిజం శాఖ మేల్కొని అతి తొందరలో మూగబోయిన కాకతీయ శిల్పారామంలో సౌండ్ అండ్ లైట్ షో నుండి కాంతులు వెదజల్లుతూ కాకతీయ సామ్రాజ్యం విశిష్టతనునేటి తరానికి కనిపించే వినిపించేలా మూడు భాషల్లో మోగించాలని స్థానికులు మరియు దేశ విదేశీ పర్యాటకులు కోరుకుంటున్నారు


