కాకతీయ, నేషనల్ డెస్క్: కోల్ కతాలో భారీ వర్షాలు బీభత్సం స్రుష్టించాయి. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వర్షాల కారణంగా వివిధ ప్రాంతాలలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కోల్కతా మధ్య , దక్షిణ ప్రాంతాలలోని బెనియాపుకూర్, కాలికాపూర్, నేతాజీ నగర్, గరియాహత్, ఇక్బాల్పూర్లలో వేర్వేరు సంఘటనలలో ఈ మరణాలు సంభవించాయి.విద్యుత్ షాక్ వల్ల ముగ్గురు మరణించగా.. వరదల్లో కొట్టుకుపోయి మరో ఇద్దరు మరణించారు.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలే ఛాన్స్ ఉన్నందున దక్షిణ బెంగాల్ లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల వల్ల పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు విమానాయన సంస్థలు తెలిపాయి. అటు ఎయిరిండియా, ఇండిగో ప్రయాణికులకు అలర్ట్ జారీ చేశారు. తాజా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి.
భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో చెట్లు కూలాయి. కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు. భారీ వరదల వల్ల షాహిద్, ఖుదిరామ్, మైదాన్ స్టేషన్ల మధ్య పలు రైల్వే కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.


