కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లింగాల ఘనపూర్ మండలం నెల్లూట్లలోని కెబిఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 67 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.67,07,774 విలువైన చెక్కులు, 32 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు రూ.11,01,000 విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. గడిచిన 15 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలేశారు. చిల్లర పనులు, అవినీతి, అక్రమాలతో ఘనపూర్‌కు చెడ్డపేరు తెచ్చారు. పదవులు, పథకాలు అమ్ముకున్నవారు ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. 21 నెలలలోనే రూ.1026 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చానని, రాబోయే మూడు సంవత్సరాల్లో మరో రూ.2000 కోట్ల నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ముందుంచిన అభివృద్ధి పనుల వివరాల్లో ఏది తప్పని నిరూపించినా దానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణి, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లి తర్వాత వెంటనే దరఖాస్తు చేస్తే మూడు నెలల్లో చెక్కు అందేలా పారదర్శకంగా పథకాలు అమలు అవుతున్నాయి” అని స్పష్టం చేశారు.
అభివృద్ధి హామీలు..
లింగాల ఘనపూర్ మండలంలోని ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు చేరుతున్నాయి అని తెలిపారు. జీడికల్ రోడ్డు పనులు శ్రీరామ నవమి లోపు పూర్తి చేస్తాం, జీడికల్ చెరువును గోదావరి నీటితో నింపుతామని చెప్పారు. గిరిజన తాండాలకు రూ.4 కోట్లతో బీటీ రోడ్లు మంజూరయ్యాయని వివరించారు. రూ.15 కోట్లతో గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


