కాకతీయ, హనుమకొండ : బాల సముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో పెండింగ్ బిల్లుల వివాదం పెద్ద దుమారం రేపింది. సుమారు రూ.4 కోట్ల బిల్లులు చెల్లించలేదంటూ కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి కళాక్షేత్రానికి తాళం వేశారు. ఏడాది క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించిన ఈ కళాక్షేత్రంలో నేటి నుండి రెండు రోజుల పాటు కాకతీయ నృత్య నాటకోత్సవాలు జరగాల్సి ఉంది.
ఈ కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరుకానుండగా, అకస్మాత్తుగా తాళం వేసి ఉండటంతో అధికారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి, కార్యక్రమాలు అడ్డంకి లేకుండా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. కార్యక్రమాలను అడ్డుకోవడం, ప్రభుత్వ ఆస్తికి తాళం వేయడం వంటి చర్యల కారణంగా కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది.


