కాకతీయ, వరంగల్ బ్యూరో : దసరా పండుగ సెలవుల సమయంలో ప్రజలు తమ ఇండ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, సెలవులను పురస్కరించుకొని స్వగ్రామాలు, విహార యాత్రలకు వెళ్తున్న సందర్భంలో చోరీలు నివారించేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు సీపీ సూచనలు..
బయటికి వెళ్తున్నప్పుడు సెంట్రల్ లాక్, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్లు వాడుకోవాలి. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్ లేదా గ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలి. బంగారం, వెండి, నగదు వంటి విలువైన వస్తువులు తప్పనిసరిగా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలి. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్క్ చేసి, ద్విచక్ర వాహనాలకు చైన్ లాక్ పెట్టాలి.
నమ్మకమైన వారినే వాచ్‌మెన్ లేదా సెక్యూరిటీగా నియమించుకోవాలి. సోషల్ మీడియాలో ప్రయాణ వివరాలు పంచుకోవద్దు. ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి, ఆన్‌లైన్‌లో నిఘా ఉంచడం మంచిది. పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి. తాళం కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పనిమనుషులు ఇంటి ముందు చెత్త, పేపర్లు పేరుకుపోకుండా చూడాలని చెప్పాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. ప్రజలు ఈ సూచనలు పాటిస్తే దసరా సెలవుల్లో చోరీలను సమర్థవంతంగా అరికట్టవచ్చని కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.


