కాకతీయ, రాయపర్తి : ప్రతి విద్యార్థి ఇష్టంతో కష్టపడి చదవాలని, అలాంటప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకొని ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించుకోగలుగుతామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుగులోత్ కిషన్ అన్నారు. శనివారం మండలంలోని మైలారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు అజ్మీరా ఉమాదేవి అధ్యక్షతన స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో హాజరై మాట్లాడారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శార ఆదేశానుసారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని లక్ష్య సాధనకై కష్టపడి చదవాలని హితబోధ చేశారు.
సమయం చాలా ముఖ్యమైనదని, ఒకసారి కోల్పోతే మళ్ళీ తిరిగి పొందలేమన్నారు. క్రమశిక్షణతో పాటు సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళిక బద్దంగా విద్యను అభ్యసించాలని పేర్కొన్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఆన్లైన్ ఆటలపై, రీల్స్ చూడడం వంటి వాటిపై ఉన్న శ్రద్ధ చదువుపై పెట్టడం లేదని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


