కాకతీయ, కొత్తగూడెం రూరల్: సింగరేణిలో పనిచేస్తున్న పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు సంక్షేమానికి పాటుపడాలని యూనియన్ గౌరవాధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ శివరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ శనివారం వినతిపత్రం అందజేశారు.
వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలని, సొంత ఇంటి పథకం అమలు, మెడికల్ బోర్డు ఏర్పాటు, అందరిని ఆన్ ఫిట్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. మారుపేర్ల సమస్య విషయంలో అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా త్వరగా ఇచ్చేట్లు ఆదేశాలివ్వాలని, ఇన్కమ్ టాక్స్ విషయంలో పర్క్యూస్ పై రికవరీ చేసిన వాటిని కార్మికులకు రిఫండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
నూతన బొగ్గుగనుల వచ్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలిచ్చి, కోయగూడెం -3, సత్తుపల్లి -3, తాడిచర్ల -2 బ్లాకులను సింగరేణికే వచ్చేలా తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమస్యలపై యాజమాన్యానికి వినతులను పంపించి దసరా తరువాత సంబంధిత మంత్రులు యాజమాన్యం యూనియన్ ను కూర్చొబెట్టి తగు నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.
లాభాల వాటా విషయంలో యాజమాన్యం, యూనియన్ నాయకులు చర్చించుకొని సంబంధిత మంత్రిని కలిసి తగు నిర్ణయం తీసుకోమని ఆదేశాలు ఇస్తానని సీఎం పేర్కొనడంతో ఆయనకు యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.


