*కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టండి
*దేవాదాయ భూముల జోలికి రాకుండా చూడాలి
*దేవుడి భూములపై లీగల్ ఫైట్ గట్టిగా చేయాలి
*భూముల పరిరక్షణలో లీగల్ టీం పాత్ర కీలకం
*ఎండోమెంటు ట్రిబ్యూనల్ అపాయింట్ చేయాలి
*న్యాయ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగడం లేదు
*ప్రభుత్వ అనుమతితో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలి
*ఎండోమెంటు గవర్నమెంటు ప్లీడర్ల సమావేశంలో మంత్రి సురేఖ
*ప్రతి ఆరు నెలలకొక సారి సమావేశం పెట్టి స్టేటస్ చెప్పాలని ఆదేశం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల జోలికి వస్తే పీడీ యాక్టు పెట్టాలని ఆశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని భూముల కబ్జాలకు యత్నించాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములు, కబ్జాల వివాదంలో ఉన్న భూముల విషయంలో లీగల్ ఫైట్ గట్టిగా చేయాలని కూడా ఆదేశించారు.
లీగల్ ఫైట్ ఎందుకు గట్టిగా చేయడం లేదంటూ కూడా అధికారులను మంత్రి నిలదీశారు. ఇకపై పరిస్థితి మెరుగు పడాలని అన్నారు. దేవుడి భూములపై లీగల్ ఫైట్ గట్టిగా చేయాలని… అసలు న్యాయ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగడం లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి పేషీలో ఎండోమెంటు గవర్నమెంటు ప్లీడర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ… ఎండోమెంటు కేసుల విషయంలో న్యాయవాదులతో ప్రతి ఆరు నెలలకొక సారి సమావేశం పెట్టి స్టేటస్ చెప్పాలని మంత్రి శాఖ అధికారులను ఆదేశించారు.
పీడీ యాక్టు పెట్టండి
దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి నొక్కి చెప్పారు. ఎండోమెంటు భూముల అన్యాక్రాంతానికి సంబంధించి కేసుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఎండోమెంటు ప్లీడర్ల పనితీరుపై మంత్రి సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవుడి భూములు కాపాడటంలో ఎందుకు జాప్యం జరుగుతోందని నిలదీశారు. తన ముందు వాదించినట్టు ఇక్కడ కోర్టులో వాదించలేకపోతున్నారని అడిగారు. ఈ సమావేశంలో ఎండోమెంటు ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, యాదగిరిగుట్ట ఈవో వెంకటరావు, కమిషనర్లు క్రిష్ణ ప్రసాద్, క్రిష్ణవేణి, ఎండోమెంటు శాఖ గవర్నమెంటు ప్లీడర్(జీపీ) బీఎం నాయక్, ఏజీపీ శైలజ, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
భూముల పరిరక్షణలో లీగల్ టీం పాత్ర కీలకం
దేవుడి భూములు కాపాడటంలో లీగల్ టీం పాత్ర చాలా కీలకమైందని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తాను దేవాదాయ శాఖ మంత్రి అయి రెండు సంవత్సరాలు అయిందని… ఇప్పటికీ కేసులు ఏం గెలిచామో తెలియడం లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే, ఇప్పటివరకు ఎన్ని కేసులు గెలిచామో వివరించాలని చెప్పారు. అసలు కేసుల విషయంలో అప్డేట్ కోసం అడిగితే… డిపార్టుమెంటులో ఎవరు చెప్ప లేకపోవడం… న్యాయ విభాగం అప్డేట్ చేయకపోవడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. మన దేవుడి భూములు మనం దక్కించుకోవాలన్నారు. దూరదృష్టితో కేసులు పరిష్కరించుకోవాలన్నారు.
ఏ కేసుల మీద న్యాయ పోరాటం చేశారో… వాటిని పరిష్కరించడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయో మంత్రి సురేఖ న్యాయ వాదులను అడిగారు. అయితే, మంత్రి ప్రశ్నకు సమాధానంగా… 2002 నుంచి 2025 వరకు 1,500 కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఈ కాల వ్యవధిలో 543 కోర్టు కేసులను డిస్పోజ్ చేసినట్టు ప్రభుత్వ ప్లీడర్లు వివరించారు. కేసుల్లో పురోగతికి సంబంధించిన అంశాలు, జడ్జిమెంట్ కాపీ ఎండోమెంటు శాఖ సెక్రటరీకి అందజేయాలని సూచించారు. ఎండోమెంటు డిపార్టుమెంటుకు సంబంధించిన కేసుల్లో రీట్ పడిన దగ్గరి నుంచి కేసు పూర్తయ్యేవరకు ఎలా ముందుకు వెళుతున్నది వివరించాలని చెప్పారు.ఎండోమెంటు భూములు కాపాడటంలో వారిదే కీలక పాత్ర గుర్తు చేశారు.
ఎండోమెంటు ట్రిబ్యూనల్ అపాయింట్ చేయాలి..!
ఎండోమెంటు ట్రిబ్యూనల్ అపాయింట్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ట్రస్టీలకు సంబంధించిన కేసుల్లో గట్టిగా వాదించాలని మంత్రి నొక్కి చెప్పారు. ఆర్కియాలజీ డిపార్టుమెంటు దగ్గర వివరాలు సేకరించాలని, ఆ సమాచారంను సాక్ష్యంగా తీసుకుని వెళ్లాలన్నారు. అందుకోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీ నియమించాలని చెప్పారు. దైవ చింతన కల్గిన వ్యక్తులు ఈ పనిలో నిమగ్నమైతే మంచిదని గుర్తు చేశారు. ఇంట్రిమ్ ఆర్డర్స్‌లో పురోగతి విషయంలోనూ మంత్రి, అధికారులు న్యాయ నిపుణులను అడిగారు. ఇట్రిమ్ ఆర్డర్స్ విషయంలో తమ డిపార్టుమెంటును అలర్ట్ చేయకపోతే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎండోమెంటు ఉన్నతాధికారులు లేవనెత్తడంతో… వాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కొవడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
అందుకు ఏం చేస్తే బాగుంటుందో తరువాతి సమావేశంలో తెలపాలన్నారు. ఎండోమెంటు కేసుల్లోని కంటెప్ట్ ఆఫ్ కోర్టు అంశాలు తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. వీటి విషయంలో గౌరవ హైకోర్టులను పిలిచేదాకా ఎందుకు తీసుకెళ్ళాలని మంత్రి అడిగారు. ఈ విషయంలో న్యాయ విభాగ టీం, వారి కింద వ్యవస్థ సరైన టైంలో ఎండోమెంటు ఉన్నతాధికారులను అలర్ట్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. భూములకు సంబంధించిన అంశాలు, టెంపుల్ ఎంప్లాయీస్ సర్వీసు వ్యవహారాలు కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అప్పుడే మన డిపార్టుమెంటుకు అనుకూలంగా వస్తాయని తెలిపారు. అయితే, వచ్చిన ఆర్డర్స్ ను అమలు పరిచేందుకు కూడా ఒక వ్యవస్థ ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు.
స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి..!
దేవాదాయ శాఖ పరిధిలోని భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని మంత్రికి చెప్పగా… అందుకు కావాల్సిన పనులు చేయాలన్నారు. సివిల్ సప్లయ్ డిపార్టమెంటులో ఉన్న మాదిరిగా ఉండాలన్నారు. కౌంటర్లు వేయడంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దన్నారు. కింది స్థాయి ఈవోలు కూడా అందుకు సహకరించాలన్నారు. ఎవరైనా సహకరించకపోతే ఎండోమెంటు సెక్రటరీ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎండోమెంటు చట్టం మీద అధికారులకు ట్రైనింగు క్లాసులు నిర్వహించాలని మంత్రి చెప్పారు. జిల్లాకో లీగల్ ఆఫీసుర్ను నియమించాలని అన్నారు. హైకోర్టుకు కూడా లైజన్ ఆఫీసర్ ను నియమించాలని… ఈవోల నుంచి ఒకరు ఉండాలని న్యాయ విభాగ టీం సూచించగా మంత్రి అనుమతించారు. వెంటనే అందుకు సంబంధించిన ప్రపోజల్ తనకి పంపించాలని పేర్కొన్నారు.


