కాకతీయ, ఆత్మకూరు : అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మదాసి సురేష్ అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రజా సంఘాలు ముట్టడించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో పారదర్శకత లేదని ఆరోపించారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం పథకాలు ఇస్తున్నారని, నిజమైన నిరుపేదకు సంక్షేమ పథకాలు అందడం లేదని పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. నాగయ్య పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నిరుపేదలకు అన్యాయం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కార్పొరేషన్ సబ్సిడీ పథకాల్లో సైతం నాగయ్య పల్లి గ్రామ ప్రజలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ఇది ఇలానే కొనసాగితే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరులో భాగంగా గ్రామంలో ఎలాంటి గ్రామ సభలు పెట్టకుండా ఎలా లబ్దిదారులను ఎంపిక చేస్తారని అధికారులను ప్రశ్నించారు.
అనంతరం ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మండల అధ్యక్షుడు రజనీకాంత్, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం, స్వామి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


