కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ లో అక్రమంగా రూ. 8.71 లక్షలు దోచుకున్న కేసులో 7గురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పొట్ల రవి, జంగమ నాగరాజు, మటేటి భాస్కర్, ధర్మారం రాజు, కాంపల్లి సంతోష్, చిట్కాల లక్ష్మీ, అసంపెల్లి లక్ష్మీలు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు. ఫేక్ లబ్దిదారులుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తమ అకౌంట్లో జమ చేసుకుని డబ్బులు విత్ డ్రా చేశారు.
నిజమైన బాధితులను మోసం చేసిన నిందితులపై ఐపీసీ 409, 417, 419, 467, 120(బి) సెక్షన్లు , ఐటీ యాక్ట్ 66(సి) కింద జూబ్లిహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో జులై 15వ తేదీన ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో జోగుల నరేశ్ కుమార్, బాలగోని వెంకటేశ్, కోర్లపాటి వంశీ, పులిపాక ఓంకార్ ఉన్నారు.
మాజీ మంత్రి కార్యాలయంలో పనిచేసిన నిందితుడు సిఎం కార్యాలయ చెక్కులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. 2023 ఎన్నికల తర్వాత, మొత్తం 230 చెక్కులను అక్రమంగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వాటిలో 19 చెక్కులను నకిలీ లబ్ధిదారుల పేర్లతో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్టు తేలింది. ఇప్పటివరకు, 8.71 లక్షల రూపాయల విలువలో చెక్కుల విత్‌డ్రా అక్రమముగా జరిగిందని పోలీసులు వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మిగిలిన నిందితులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నారు. తప్పించుకుని పారిపోయిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ప్రారంభించాయి. పోలీసులు కేసును వేగంగా పూర్తిచేయాలని, బాధితుల ఆర్థిక నష్టం రాహిత్యంగా పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.


