కాకతీయ, సినిమా డెస్క్: జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ‘హోమ్ బౌండ్’ సినిమా విడుదలకు ముందే విశేష గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2026 అవార్డుల కోసం భారత తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. శుక్రవారం సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్ ఎన్. చంద్ర ఈ విషయాన్ని ప్రకటించారు. ఇండియా నుంచి పోటీ పడిన 24 చిత్రాల్లో నుంచి ‘హోమ్ బౌండ్’ కు ఈ ప్రతిష్టాత్మక అవకాశం దక్కడం విశేషం.
ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు పొందిన ఈ మూవీకి ఇప్పుడు ఆస్కార్ రేస్‌లో చోటు దక్కడం మరో మైలురాయి. దీంతో సినిమా టీమ్ అంతా ఆనందంలో మునిగిపోయారు.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌తో పాటు ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా ముఖ్య పాత్రలు పోషించారు. నీరజ్ మైవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా కలిసి నిర్మించారు.
కథ విషయానికొస్తే .. ఇద్దరు స్నేహితులు పోలీసు కావాలని కలలు కంటారు. కానీ వారిని జాతి, మత పరమైన అడ్డంకులు అడ్డుకుంటాయి. ఈ అడ్డంకులను అధిగమించి తమ కలను నెరవేర్చుకునే క్రమంలో వారు ఎదుర్కొనే సంఘర్షణలు, పోరాటాల చుట్టూ కథ తిరుగుతుంది. సామాజిక సమస్యలను రియలిస్టిక్ టచ్‌తో చూపించడమే ఈ సినిమాకు ప్రత్యేకత.
‘హోమ్ బౌండ్’ సినిమా సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆస్కార్ ఎంట్రీతోపాటు, ఇప్పటికే దక్కిన ఫెస్టివల్ గుర్తింపులు సినిమా కోసం అంచనాలను మరింత పెంచేశాయి.


