కాకతీయ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో ఇసుక దందా వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ అంశంపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేస్తున్నారు. ఇరు పార్టీలు పోటాపోటీగా ధర్నాలకు పిలుపునివ్వడంతో పట్టణంలో టెన్షన్ నెలకొంది.
కాంగ్రెస్ నేతలు గండ్ర వెంకటరమణారెడ్డి దంపతుల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు పిలుపునిచ్చారు. దీనికి ప్రతిగా బీఆర్‌ఎస్ నేతలు స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఘటనలతో వాతావరణం మరింత వేడెక్కింది.
పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జోక్యం చేసుకున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని శాంతి భద్రతలు కాపాడేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఇసుక మాఫియా ఆరోపణలపై ఇరు పార్టీలు రాజీ పడకపోవడంతో, భూపాలపల్లిలో రాజకీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.


