ఆల్మట్టిపై ప్రభుత్వం మౌనం
5మీటర్ల ఎత్తు పెంచితే కృష్ణా నదిఎడారి
క్రికెట్ ఆడుకునేందుకే మనకి పనికొస్తది
మన రైతాంగానికి ఇక దుఃఖమే మిగులుతుంది
ముంపు ప్రాంతాలు పెరుగుతాయని మహారాష్ట్ర సీఎం కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశారు
మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సోయి రేవంత్ సర్కారుకు ఎందుకు లేదు
భూ సేకరణకు, నిర్మాణాలకు రూ.70వేల కోట్లు కేటాయించిన కర్ణాటక ప్రభుత్వం
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణానికి ప్రయత్నాలు
నన్ను బీఆర్ఎస్ సోషల్ మీడియా టార్గెట్ చేసింది
బీసీ నినాదంతో పనిచేసేవారంతా మాకు హృదయులే
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా నది మనకు క్రికెట్ ఆడుకునేందుకు తప్పా ఎందుకు ఉపయోగపడదని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కృష్ణ జలాల వినియోగంలో వివాదం ఉందని, దీనిపై సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 5 మీటర్లకు పెంచేందుకు ప్రయత్నాలు ఆరంభించిందన్నారు. అదే జరిగితే 100 టీఎంసీల నీరు దిగువకు రాకుండా అడ్డుకున్నట్లవుతుందన్నారు. మహారాష్ట్రలో రెండు జిల్లాల్లో ముంపు ప్రాంతాలు పెరుగుతాయని, తెలంగాణ రావాల్సిన కృష్ణ జలాలు పూర్తిగా అడుగంటుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఫడ్నీవీస్ లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన గాని, చర్యలు తీసుకోకపోవడం అనుమానాలు కలిగిస్తోందన్నారు. శనివారం తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణలోని దక్షిణ జిల్లాలకు.. ముఖ్యంగా నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి రైతులకు దుఃఖమే మిగులుతుందన్నారు.
మన ప్రభుత్వానికి సోయిలేదు
కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని ప్రకటించకపోవడాన్ని కవిత తప్పుపట్టారు. పొరుగు ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడే తీరిక, చొరవ ఇక్కడి రేవంత్ సర్కారు లేదా అంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సోయి మన ప్రభుత్వానికి ఎందుకు లేదు అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే..జలాల విషయంలో అన్యాయం జరుగుతుంటే జాగృతి ఊరుకోదని స్పష్టం చేశారు. త్వరలోనే దీనిపై ఓ స్పష్టమైన కార్యాచరణతో దఫాల వారీగా ఉద్యమంతో ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. ఓ వైపు కర్ణాటక ప్రభుత్వం భూ సేకరణకు ప్రక్రియ మొదలు పెట్టడం.. బడ్జెట్‌లో రూ.70 వేల కోట్లను కేటాయింపులు చేస్తూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. మన రాష్ట్ర ప్రభుత్వం ఏం జరగడం లేదు అని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి కంటూ మండిపడ్డారు.
స్పీకర్‌కు చెప్పాను రాజీనామాను ఆమోదించాలని..!
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేయడం జరిగిన విషయం మీ అందరకి తెలుసు… అది కూడా స్పీకర్ ఫార్మెట్‌లోనే చేయడం జరిగిందని కవిత స్పష్టం చేశారు. మండలి స్పీకర్ నాకు కాల్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను.. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని నా రాజీనామాను ఆమోదించాల్సింగా కోరానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్‌మీడియా నన్ను టార్గెట్ చేసిందన్న విషయం అందరకీ తెలిసిందేనంటూ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు కవిత సమాధానం చెప్పారు. బీఆర్ ఎస్ సోషల్ మీడియానే కాదు.. హరీష్‌రావు సోషల్ మీడియా, సంతోష్‌రావు సీక్రెట్ మీడియా కూడా నన్ను టార్గెట్ చేసిందని కవిత వ్యాఖ్యనించారు. ఎవరు ఎన్ని చేసినా తాను వెనకడుగు వేసేది లేదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసే వారికి ఏం సమాధానం చెబుతామని, కానీ తానుమాత్రం స్పష్టమైన రాజకీయం చేయదల్చుకున్నానని అన్నారు.
బీసీ గళం వినిపించే వాళ్లు.. హృదయులే..!
బీసీ నినాదంతో ఎత్తుకుని పనిచేసేవాళ్లతో తమకెలాంటి ఇబ్బందులు, విబేధాలు లేవంటూ తీన్మార్ మల్లన్న టీఆర్పీని ఉద్దేశించి కవిత అన్నారు. బీసీ నినాదం సమస్యలపై పోరాటం చేసే పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎక్కువగా ఉంటే వాయిస్ కూడా ఎక్కువగా వినిపిస్తుందని అది ఆరోగ్యకరమైన సమాజానికి కూడా మంచిందన్నారు. బీసీ హక్కుల కోసం పోరాటం చేసేవాళ్లంతా మాకు హృదయులేనంటూ వ్యాఖ్యనించారు. స్థానకి ఎన్నికల నిర్వహణలో, బీసీ రిజర్వేషన్ల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేవలం బీసీ రిజర్వేషన్ల విషయంలో తప్పించుకునే ధోరణితోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈనెల 30వరకు మాత్రమే గడువు ఉన్నా.. చివరి నిముషంలో కోర్టుకు వెళ్లవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కవిత విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను పట్టించుకోని ప్రభుత్వంపై ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. త్వరలోనే మంత్రుల ఇళ్లను ముట్టడించడం జరుగుతుందన్నారు.


