కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోనే రేపటి తెలంగాణ భవిష్యత్తు తేలనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కి జూబ్లీహిల్స్ జైత్రయాత్రతో ప్రజలు చెక్ పెట్టాలి అన్నారు.
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు అమలుకావని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్‌నే రేవంత్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. రాహుల్ నిత్యం విమర్శించే మోడీ, అదానీలను రేవంత్ వెనకేసుకొస్తున్నాడని అన్నారు. ముస్లీంల మనోభావాలను దెబ్బతీసేలా వక్ఫ్ సవరణలను దేశంలోనే తొలిసారిగా రేవంత్ ప్రభుత్వం అమలు చేసిందని విమర్శించారు. చరిత్రలో తొలిసారి ముస్లీం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడూ బీఆర్ఎస్‌నే గెలిపించారని గుర్తుచేసిన కేటీఆర్, మాగంటి గోపీనాథ్ మూడోసారి విజయం సాధించగా, ఆయన సేవలను కొనసాగించేందుకు సతీమణి సునీత ముందుకొచ్చిందని తెలిపారు.
సునీతకు ప్రజలు ఆశీస్సులు అందించాలన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ.. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసింది కానీ ఏవీ అమలు కాలేదు అన్నారు. బస్తీ ప్రజలు ఇండ్లు కూల్చివేస్తారనే భయంతో వణుకుతున్నారని, కూకట్ పల్లిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం దీనికి ఉదాహరణ అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఎవరి ఇల్లు కూల్చలేదని, కానీ ఈ ప్రభుత్వం పేదవాడి కడుపు కొడుతోందని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ.. మోడీ దగ్గర స్కూల్, చంద్రబాబు దగ్గర కాలేజ్, రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని రేవంత్ చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ దగ్గర చదువుతుంటే ఫెయిల్ అయ్యి పార్టీ నుంచి వెళ్ల గొట్టారు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్‌కు ఓటు అంటే మీ చేత్తో మీ కంటినే పోడుచుకోవడమే. 420 హామీల అమలు ఎప్పుడు అని ఎక్కడికక్కడ ప్రశ్నించండి. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించడం బీఆర్ఎస్ కార్యకర్తల బాధ్యత అని పిలుపునిచ్చారు.


