– కాంగ్రెస్‌కు పట్టున్న ప్రాంతాలే లక్ష్యంగా కుట్ర
– ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలే టార్గెట్
– నకిలీ అప్లికేషన్లు, ఫోన్ నంబర్లు, లాగిన్లతో ఓటర్ ఐడీల తొలగింపు
– కర్ణాటక ఆలంద్ నియోజకవర్గంలో మోసం
– మా దగ్గర వందశాతం ఆధారాలు ఉన్నాయ్
– రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు
– ఇందిరభవన్‌లో మీడియా సమావేశం
– రాహుల్ ఆరోపణలను ఖండించిన ఈసీ
– సాఫ్ట్‌వేర్‌తో ఓటర్ ఐడీలను తొలగించలేరని వెల్లడి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ మండిపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో ఓట్లను తొలగించారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో ఇందిరా భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఇది కేవలం ఓట్ల జాబితా సమస్య కాదని, లక్షలాది మంది ఓటర్ల హక్కులపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. కర్ణాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో 6,018 ఓట్లను నకిలీ లాగిన్‌ల ద్వారా తొలగించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ అప్లికేషన్‌లు, తప్పుడు ఫోన్ నంబర్లు ఉపయోగించి ఓటర్ ఐడీల తొలగింపునకు అప్పీల్ చేశారని రాహుల్ తెలిపారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్న బూత్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపు జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఓట్ల తొలగింపు అంతా కూడా వ్యక్తులతో కాకుండా, సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుక చేస్తున్నారని అన్నారు. దీనికి సంబంధించి తమ వద్ద వందశాతం ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో ఈ మోసం జరిగిందని, గోదాబాయ్ పేరుతో ఫేక్ లాగిన్ ఉపయోగించి 12 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని ఆయన తెలిపారు. ఓట్ల తొలగింపు కోసం ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ ఉపయోగించారని, ప్రతి బూత్‌లో మొదటి ఓటరును దరఖాస్తుదారుగా చూపేలా చేశారని వెల్లడించారు. ఎక్కువ ఓట్లు తొలగించిన టాప్ 10 బూత్‌లన్నీ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రాంతాల్లో ఉన్న చోటనే జరిగాయని రాహుల్ తెలిపారు.
ఓట్ల చోరీకి పాల్పడేవారిని ఎన్నికల సంఘం చీఫ్ రక్షిస్తున్నారని, ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ చేస్తున్న అభ్యర్థనలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఇది హైడ్రోజన్ బాంబ్ కాదని, దానిని త్వరలో పేలుస్తానని వెల్లడించారు. కాగా, రాహుల్ గాంధీ ఆరోపణలనుకేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, ఓటర్ ఐడీలను డిలిట్ చేయడం సాధ్యం కాదని పేర్కొంది.


