సొసైటీలో అక్రమాలను బహిర్గతం చేయాలి
అప్పటి వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు
మాజీ జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు
కాకతీయ, బయ్యారం: బయ్యారం సొసైటీని అడ్డాగా చేసుకొని మూల మధుకర్ రెడ్డి చేయని దందా, అవినీతి, అక్రమాలు లేవని, సొసైటీలోనే పంచాయతీలు,సెటిల్ మెంట్లు చేసేవారని మహబూబాబాద్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు విమర్శించారు. సొసైటీలో దొంగ ఖాతాలు తెరిచి అందిన కాడికి లక్ష ల రూపాయిలు కాజేశాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బానోత్ మురళి కృష్ణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కోదండరామస్వామి ఫంక్షన్ హాల్ లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2021లో రూ.80 లక్షలు అక్రమాలకు పాల్పడుతున్న విషయం డైరెక్టర్లు గమనించి, అప్పటి జిల్లా డిసిఓకు ఫిర్యాదు చేసినా అధికారులు కాలయాపన చేసి పట్టించుకోలేదని విమర్శించారు.
బీఆర్ ఎస్ నాయకులు, పిఎసిఎస్ కార్యవర్గ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ తూతూ మంత్రంగా చేబట్టి రూ.50లక్షలు రికవరీ చేసినట్లు చెప్పారని, అప్పటి నుండి నేటి వరకు అతనిలో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. సొసైటీలో జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక అధికారిని నియమించి, క్షుణ్ణంగా విచారణ జరిపించాలని కోరారు. అధికారులు దొంగ సొమ్మును రికవరీ చేయని యెడల దశల వారీగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే రైతు సహకార సంఘంలోని రైతులకు ఏ మేరకు న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిపరుడైన మధుకర్ రెడ్డి వెంట ఎమ్మెల్యే పైరవీలు ఎందుకని ప్రశ్నించారు. కార్యక్రమంలో బయ్యారం పిఏసిఎస్ మాజి చైర్మన్ గంగుల సత్యనారాయణ, నాయకులు ఏనుగుల ఐలయ్య, యూత్ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ జగన్, తదితరులు పాల్గొన్నారు.


