ఆత్మగౌరవం కోల్పోవవద్దు
తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలెక్క విసిరిపడేశాం
తెలంగాణ.. ప్రజల రక్త తర్పణానికి గుర్తు..!
పిల్లలకు విలువలను వారస్వత్వంగా ఇవ్వండి
చిన్నతనం నుంచే దేశభక్తిని నేర్పించండి
సమాజంలో సంఘటనలు కలిచి వేస్తున్నాయి
ఎక్కడో జరుగుతున్నాయయి అనుకోకండి, అది మీ గడపను కూడా తడుతుంది
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఆత్మగౌరవం లేని పదవులు గడ్డి పోచతో సమానమని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలెక్క విసిరి పాడేశానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా బతికించుకునేందుకు.. మన రాజీలేని పోరాటాన్ని చాటేందుకు 20ఏళ్లలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కావాల్సిన నేను.. ఆరుసార్లు అయ్యానని అన్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహా ఆవిష్కరణలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిలతో కాలిసి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఈటల మాట్లాడుతూ ఈ పార్క్ చిన్నదే అయినా గొప్ప విగ్రహాన్ని పెట్టారు.. ఇది దేశభక్తికి, కమిట్మెంట్ కి నిదర్శనమంటూ కొనియాడారు. మహనీయుల విగ్రహాలను పెట్టుకోవడం.. జయంతులు, వర్ధంతులు చేసుకోవడం కేవలం ఒక దండ వేసుకోవడానికే మాత్రమే కాదు వారి చరిత్ర భావితరాలకు అందించడం కోసమని అన్నారు.
తెలంగాణ.. ప్రజల రక్త తర్పణానికి గుర్తు..!
మనం నిన్న ఎగురవేసుకున్న జాతీయ జెండా తెలంగాణ ప్రజల రక్త తర్పణాన్ని గుర్తు చేసిందన్నారు. దేశంతో పాటు మనకు స్వతంత్రం రాలేదని, దానికోసం మన పూర్వీకులు పడ్డ కష్టం భావితరాలకు అందించడమే నిన్న వేడుకల లక్ష్యమన్నారు. భారత స్వాతత్రం కోసం లక్షల మంది పోరాటాలు చేశారు, ఎంతో మంది త్యాగాలు చేశారు. అవి గుర్తు చేసుకుంటే రోమాలు నిక్కబొడుస్తాయని అన్నారు. సుభాష్ చంద్ర బోస్ గొప్ప మేధావి. ఆనాడే ఇప్పటి ఐఏఎస్ లాంటి చదువులో నిష్ణాతుడు. నా ప్రాణం నా కోసం కాదు నా భారత జాతి విముక్తికోసం, భరతమాత సంకెళ్లు తెంచడానికి పోరాడిన వారని అన్నారు. భారత దేశంలో ఇది సాధ్యం కాకపోతే వేరే దేశానికి వెళ్లి “ఆజాద్ హింద్ ఫౌజ్” స్థాపించి దేశంకోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు చంద్రబోస్ అని అన్నారు. 79 సంవత్సరాల స్వతంత్ర వేడుకల గంభీరత మనలాగా ఈ తరానికి తెలియదు. వారు పుస్తకాలు చదవడం లేదు, చరిత్ర తెలుచుకోవడం లేదు. కంప్యూటర్ యుగంలో ఉన్నారని అన్నారు.
ఆత్మగౌరవమే ముఖ్యం.. అందుకే పోరాడం..!
అభివృద్ధి కావాలా ? ఆత్మగౌరవం కావాలా అంటే ముందు కోరుకొనేది ఆత్మగౌరవం, స్వయం పాలన.. కానీ ఆనాడు అది లేకుండే. ఆత్మగౌరవం కోల్పోయిన తరువాత వచ్చే ఏ పదవైనా గడ్డి పోచతో సమానమని ఈటల అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలాగా విసిరి వేసినం. ఇరవై ఏళ్ళల్లో 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సింది 6 సార్లు అయ్యాం. మాకు ఆత్మగౌరవం, స్వయంపాలన కావాలని కొట్లాడినం. భగత్ సింగ్ చిన్న పిల్లాడు. డయ్యర్ జలియన్ వాలాబాగ్ లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి వందల మంది భరత జాతి ముద్దు బిడ్డల రక్తం కళ్లచూసిన నాడు.. ఆ రక్తంతో తడిచిన మట్టిని పట్టుకొని ప్రమాణం చేశాడు. అందుకోసం ప్రాణత్యాగం చేశాడని కొనియాడారు. ఝాన్సీ లక్షిభాయి చిన్న పిల్లను ఎత్తుకొని యుద్ధం చేసింది. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రం ఎంతోమంది త్యాగఫలం అని మర్చిపోవద్దు. పిల్లలకు దేశభక్తి నేర్పించాలి. దేశభక్తి, కమిట్మెంట్ లేకుంటే కష్టం అవుతుంది. పక్క దేశాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. భారత దేశంలో 140 కోట్ల జనాభా.. ఒక్కొకరిది ఒక్కో సంస్కృతి, సంప్రదాయం. అనేక వైరుధ్యాలతో కూడినది మనదేశం. 79 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది అంటే దానికి కారణం మన సంసృతి సంప్రదాయలు.. భిన్నత్వంలో ఏకత్వం, మన రాజ్యాంగం. ఈ పరంపర కొనసాగించడం కోసమే ఇలాంటి విగ్రహాలు పెట్టుకోవడమని అన్నారు. పిల్లలకు వారస్వత్వంగా అందిచాల్సింది కేవలం ఆస్తులు మాత్రమే కాదు. మన విలువలు సంప్రదాయాలు వారసత్వంగా అందించాలి.
సంఘటనలు కలిచి వేస్తున్నాయి..!
ఈరోజుల్లో తరుచూ సమాజంలో జరుగుతున్న సంఘటనల వార్తలు కలిచి వేస్తున్నాయని ఈటల అన్నారు. కన్న తల్లిదండ్రులను చంపుతున్నారు. కడుపున పుట్టిన పిల్లలను చంపుతున్నారు.
సొంత భర్తను చంపుతున్నారు. వీటి నుంచి కాపాడేది మన విలువలే. ఎక్కడో జరుగుతున్నాయి అనుకోకండి.. అది మీ గడపను కూడా తడుతుంది. అందుకే పిల్లలను జాగ్రత్తగా పెంచండి.
అన్ని జీవుల్లో కెల్లా మానవ జీవితం గొప్పది. అది ఉన్నతంగా ఉండాలే చూడాలని ప్రజలందరినీ కోరుతున్నాను అన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అతి ఎక్కువ పర్యటనలు చేస్తున్న ఎంపీగా ఈటల రాజేందర్ మొదటి స్థానం వస్తుందన్నారు. ఎంపీ అయిన రోజునుంచి ఆయన ఇంట్లో ఉన్నది లేదు. ప్రతి రోజు ప్రజల మధ్య ఉంటున్నారు. అలానే నిధులు కూడా ఇవ్వాలని ఆయన్ను కోరుతున్నాం. ఈ ప్రాంతంలో రోడ్లు బాగా ధ్వంసం అయ్యాయి బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెరువులను కాపాడుకోవాలన్నారు.


