కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, గత పదేళ్లలో కేవలం హామీలకే పరిమితమైన అభివృద్ధిని, ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనుల రూపంలో చూపిస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండలో బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
అదాలత్ కూడలిలోని అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర మంత్రి పొంగులేటి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి, అమరవీరుల త్యాగాలు, ప్రజా పాలన ప్రాముఖ్యత, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు.
హైదరాబాద్-సికింద్రాబాద్ తరహాలో హనుమకొండ, వరంగల్ నగరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం దాదాపు రూ.5వేల కోట్లతో మౌలిక వసతుల పనులు చేపట్టింది. భవిష్యత్ జనాభా వృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూ. 4,100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, భద్రకాళి దేవాలయ ఆధునీక రణలో భాగంగా మాడ వీధుల నిర్మాణం, పాత కలెక్టరేట్ బంగ్లా పునరుద్ధరణ పూర్తి దశలో ఉన్నాయని తెలిపారు.
జాతీయ రహదారి విస్తరణలో ఘనపూర్ – ఐనవోలు, ఒగ్లాపూర్ – ధర్మవరం రోడ్ల విస్తరణ పనులు పూర్తి అయ్యాయని, వంగర గ్రామంలో ఏడు కోట్లతో పి.వి. నరసింహారావు విజ్ఞాన వేదిక పనులు, పరకాలలో రూ. 35 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రెండు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, హనుమకొండ లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదనల్లో ఉన్నాయి. కాలోజీ కళాక్షేత్రం పనులను పూర్తి చేసి ప్రారంభించడం ప్రభుత్వ పెద్ద విజయంగా నిలిచిందన్నారు. పర్యావరణం, వ్యవసాయం వన మహోత్సవంలో 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గత ఏడాది 957 హెక్టార్లలో అడవుల పునరుద్ధరణ జరిగిందని, రైతులకు తగిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది 5వేల ఎకరాలలో పామ్ ఆయిల్ తోటలు సాగు చేస్తున్నారు. ప్రజలు కులమతాలకు అతీతంగా సమాన న్యాయం చేస్తూ, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలులోకి తెస్తామని తెలిపారు. ఎన్ఐటీ వద్ద మంత్రికి ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


