కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రైతులకు నష్టపరిహారం చెల్లించినందుకు కలెక్టర్‌పై విమర్శలు చేయడం తగదని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 900 మంది రైతులకు నష్టపరిహారం అందించినందుకు జిల్లా కలెక్టర్ దివాకర్ ను పార్టీ కార్యకర్త అని ఆరోపించడం సరైంది కాదు అని, రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చిన దళారుల వల్ల రైతుల చావు జరిగింది అని, ఆ రైతులకు నష్టపరిహారం అందించడం కలెక్టర్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. కేటీఆర్ రైతు పక్షాన ఉన్నాడా? లేక దళారుల పక్షాన ఉన్నాడా? తన వైఖరి స్పష్టంగా చెప్పాలి అని, కలెక్టర్‌ను కేటీఆర్ సమక్షంలో అవమానించినప్పుడు కేటీఆర్ స్పందించకపోవడం దురదృష్టం అని అన్నారు.
అలాగే బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే కలెక్టర్‌ను రాష్ట్రంలో లేకుండా చేస్తా అని నరసింహమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


