కాకతీయ, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదని , ప్రజల అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూమార్ అన్నారు. బుధవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని జాతీయ పతకాన్ని ఎగురవేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లడుతూ.. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ నిజాం చెర నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక సందర్భాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ పోరాట యోధులు, వీరమరణం పొందిన నాయకులను ఆయన ఘనంగా నివాళులర్పించారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుండి 2014లో రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన చారిత్రాత్మక ఘట్టాలను ఈ సందర్బంగా మంత్రి ప్రస్తావించారు.
అలాగే జిల్లాలో సంక్షేమ ఫథకాల గురించి మంత్రి మాట్లడుతూ..మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 5.35 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, దీంతో రూ. 227 కోట్ల లబ్ధి పొందారని, గ్యాస్ సిలెండర్‌లను 500 రూపాయలకే 6.33 లక్షలు పంపిణీ చేసి, రూ.19.59 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందన్నారు.
గృహజ్యోతి పథకం కింద 1.58 లక్షల సర్వీసులకు జీరో బిల్లులు జారీ చేసి రూ. 6.94 కోట్ల రూపాయలు చెల్లించారని, ఇందిరమ్మ రైతు భరోసా ద్వారా 1.90 లక్షల మంది రైతులకు రూ. 206.62 కోట్ల రూపాయలు జమ చేశారన్నారు. రుణ మాఫీ కింద 79,541 మంది రైతులకు రూ. 622.06 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని, రైతు బీమా కింద మరణించిన రైతు కుటుంబాలకు రూ. 25.50 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,483 వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.7.48 కోట్ల రూపాయలు అందించారని, ఆరోగ్యశ్రీ కింద 15,436 మందికి 44.23 కోట్ల విలువైన ఉచిత శస్త్ర చికిత్సలు జరిగాయని, జిల్లాలో 11,575 మందికి ఇండ్లు మంజూరు కాగా, 5,844 ఇండ్ల పనులు ప్రారంభం అవగా ఇప్పటివరకు రూ. 45.91 కోట్ల రూపాయలు విడుదల అయినట్లు అయన తెలిపారు.
29,426 భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరిస్తూ, 233 లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారని, రబీ సీజన్‌లో 3.10 లక్షల టన్నుల ధాన్యం సేకరించి, 58,302 మంది రైతులకు రూ. 720.85 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. 39,645 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి, జిల్లాలో 3.13 లక్షల కుటుంబాలకు నెలనెలా 5,913 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు వసతి గృహాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు.
1.23 లక్షల జాబ్ కార్డులు జారీ చేసి, రూ.15.40 లక్షల పని దినాలు కల్పించడం జరిగిందన్నారు.517 వ్యక్తిగత యూనిట్లకు రూ.10.16 కోట్లు, 78 గ్రూపు యూనిట్లకు రూ. 7.36 కోట్లు, 338 సంఘాలకు రూ. 54.49 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు చేశారని అయన తెలిపారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంలో అందరి సహకారం అమూల్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం అని అయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ తదితరులు పాల్గోన్నారు.


